Tuesday, January 3, 2012

సీక్రెట్ శాంటా.. నా జాతకానికి నిదర్శనం


ఈమధ్య మా ఆఫీస్‌లో హెచ్ఆర్ వాళ్లకి పిచ్చి పీక్స్‌కెళ్లిపోయింది. వారానికోరోజు  ఏదో ఒక డే పెట్టి జనాల్ని చంపుకుతింటున్నారు. ఒకరోజు ట్రెండీ డే, ఇంకోరోజు మాస్క్ డే, ఆ మర్నాడు ఫైర్‌డే, అటుమర్నాడు వాళ్ల పిండాకూడు డే.. ఇలా డేల మీద డేలు చేసి, డే అండ్ నైట్ అలిసిపోయి వాళ్ల దరిద్రగొట్టు డేల మీద వాళ్లకే చికాకేసింది. దాంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చెయ్యాలా అని అప్పుడెప్పుడో సునామీలో కొట్టుకుపోగా మిగిలిన కొద్దిపాటి మెదడు అవశేషాల్ని మథించడం మొదలెట్టారు.

సివరాకరికి తమదే అని చెప్పుకుంటూ ఎక్కడో ఎత్తుకొచ్చిన ఒక అవిడియాతో ముందుకొచ్చారు. ఒకానొకరోజు ఒక కొబ్బరిచిప్ప మొహం గాడు ఓ సంచిలో చీటీలు వేసుకుని వచ్చి నా ముందు నిలబడ్డాడు. ఏంది కత అని కొచ్చెనింగు చేస్తే, అందులోంచి ఒక చీటీ తియ్యమని మూగసైగలు చేశాడు. ఎందుకు అని ఆడిగా. అందులోంచి ఎవరి పేరొస్తే వాళ్లతో కలిసి డాన్స్ చెయ్యాలి.. ఆడైనా, మగయినా అన్నాడు. ఆడైనా? మగయినానా? మనకే డాన్సే రాదు. అందులో మళ్లీ మగవెధవలతో డాన్సులేంటి అసహ్యంగా? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, తీస్తే అమ్మాయి పేరున్న చీటీయే తియ్యాలి అని ఫిక్సయ్యి బాగా కలిపి ఒక నిగనిగలాడే చీటీ తీసి విప్పి చూశా..

నోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ.... మగపురుగు



ఆ రోజు సిక్‌లీవ్ గ్యారంటీ అనుకున్నా. ఇంతలో మా డామేజర్ లేచి కెవ్వుమని కేకెట్టాడు. ఏమైందో అని చూస్తే మీరు తీసిన చీటీల్లో ఉన్నవాళ్లని ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావాలి. అది మీరు తెచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. దీని పేరు సీక్రెట్ శాంటా అన్నాడు. నీ బొంద అని అనుకుని కొబ్బరిచిప్పగాడి వైపు చూశాను. జోకానులే అన్నట్టు పళ్లికిలించుకుంటూ నవ్వాడు. ఆడి మొహం చూసే ఓపిక లేక, ఇది ఎలా తప్పించుకుందామా అని ఆలోచించడం మొదలెట్టాను(బేసిక్‌గా ఎవడిదగ్గరైనా తీస్కోవడమే తప్ప ఇచ్చే అలవాటు లేదు మనకి).



ఇంతలో మా టీమ్‌లీడర్ నావైపు చూసి పట్టుకురాకపోతే నీకుంది చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు. మనకి ఇలాంటివి ఎగ్గడంలో మంచి రికార్డు ఉంది. దాంతో మా లీడ్ నన్ను గుర్తుపెట్టేసుకున్నాడు. తప్పదురా బాబూ అనుకుని, ఒక గిఫ్ట్ కొని తెచ్చి పడేశాను. ఈ గేమ్‌లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎవడు ఎవడికి గిఫ్ట్ ఇచ్చాడో, ఏమి ఇచ్చాడో ఇచ్చేవాడికి తప్ప తీసుకునేవాడికి తెలీదు. దాని మీద ఇచ్చేవాడి పేరుండదు. అందువల్ల ఎంత చెత్త, కక్కుర్తి గిఫ్ట్ ఇచ్చినా ఎవరికీ తెలీదు. అయినా సరే.. కొత్త సంవత్సరం రోజు వాడ్ని ఏడిపించడమెందుకులే అని మంచి గిఫ్టే కొనిచ్చాను. మనకి కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి ఇస్తాడుగా కవర్ అయిపోతుందిలే అనుకున్నా.

ఇంతలో ఈ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమం మొదలెట్టారు. ఒక్కొక్కరి పేరు పిలుస్తుంటే నా పేరే పిలిచినట్టు అనిపించి లేవడం.. మనది కాదని తెలిసి కూర్చోవడం.. ఇలా నాలుగు సార్లు ఎక్సర్‌సైజ్ చేశాక నూటయాభైమందికి గిఫ్ట్‌లు పంచేశారు. మిగతావాళ్ల గిఫ్ట్‌లింకా రాలేదు రేపు మళ్ళీ ఈ రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తామని వాగ్ధానం చేశారు. సర్లే.. ఇవాళ కాకపోతే రేపైనా రాకతప్పదుగా. ఎవడొ మనకోసం షాపింగ్‌మాల్స్ అన్నీ తిరిగి సిద్ధం చేస్తున్నట్టున్నాడు. ఆమాత్రం టైం తీస్కోనీ అనుకున్నా..

మర్నాడు మళ్లీ మొదలెట్టారు. గిఫ్ట్ కాదు కదా దాని మీద కట్టే రిబ్బన్ కూడా రాలేదు. మూడో రోజు వెళ్ళిపోయింది. జనవరి ఒకటో తారీఖు వచ్చేసింది. గిఫ్ట్ లేదు.. గాడిదగుడ్డు లేదు.. ఒకటి, రెండు వెళ్లిపోయి మూడొచ్చేసింది. కానీ గిఫ్ట్ మాత్రం రాలేదు. ఇక ఉండబట్టలేక మా లీడ్‌ని అడిగాను. బాబూ ఇంకా గిఫ్ట్‌లేమన్నా మిగిలాయా? అన్నీ ఊడ్చేశారా? అని. ఇంకేం మిగల్లేదు నాయనా. ఈ పంపిణీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అన్నాడు. ఓ నలుగురికి మినహా అందరికీ గిఫ్ట్‌లొచ్చాయి. అందులో ముగ్గురు వారం నుంచీ లీవ్‌లో ఉన్నారు. మిగిలింది నువ్వు..అని చిరునవ్వు విసిరాడు.

మరి నా సంగతేంది..?? అని అడిగాను. 'బిస్కట్' అని తలకాయ అడ్డంగా తిప్పాడు. బిస్కట్ లేదు, చాక్లెట్ లేదు నా గిఫ్ట్ నాక్కావాలీఈఈఈఈఈఈఈఈఈఈ.. అని గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే అరిచెయ్యి ఆకాశం వైపు చూపించాడు. విషయం అర్థమయ్యి సైరన్ ఆపేసి వచ్చి కూర్చున్నాను. ఇంతలో ఒక అదృశ్యహస్తం వెనకనుంచి గోకింది. తిరిగిచూస్తే నా చేత గిఫ్ట్ తీసుకోబడ్డ మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రకెక్కిన చేగోడీ మొహంగాడు. నాకెవడో ఇది గిఫ్ట్‌గా ఇచ్చాడు బాగుందా? అని నోరెళ్లబెట్టుకుని అడిగాడు. ఇప్పుడే వస్తా అని లేచి రెస్ట్‌రూంలోకి వచ్చాను.

నిర్మానుష్యంగా ఉన్న రెస్ట్‌రూంలో నేను, నాలుగు కుళాయిలు, రెండు అద్దాలు, ఒక చెత్తబుట్ట.. తల పైకెత్తి ఎదురుగా ఉన్న అద్దంలోకి చూశాను. అద్దంలో సుందర సుమనోహర దివ్య స్వరూపం...



               "థూ.. నీ  @$%్%%$^%*్$$%%్!"



10 comments:

  1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్............పాపం :P

    ReplyDelete
  2. తిరిగిచూస్తే నా చేత గిఫ్ట్ తీసుకోబడ్డ మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రకెక్కిన చేగోడీ మొహంగాడు :)))
    Post is LOLLARIOUS!

    ReplyDelete
  3. Soumya gaaru, Andy.. Thank you :)))

    ReplyDelete
  4. హహహ! కెవ్వు పోస్టు నవ్వులతో అరిపించారు!

    ReplyDelete
  5. హ హ హ very well written

    ReplyDelete
  6. హాస్యం బాగా పండింది.

    ReplyDelete
  7. Super basu... maa team lo aite naa peru naake vachindi... funyy sangatentante maa team lo unna oka ammai, tanakochina gifts nene istunnananukuni tega murisipoindata. papam maa manager yadava manchi expensive gifts ichadu aameki. aameki nenu ivvaledani tega feel aipoyindi...
    very funny

    ReplyDelete
  8. రసజ్ఞగారు, కుమార్‌గారు, శ్రీ గారు.. ధన్యవాదాలు ద.హా.

    జగన్‌గారు.. ఆమెని అలా ఫీల్ అవ్వనివ్వండి. కనీసం మీకైనా మీ డామేజర్ ఇలా ఉపయోగపడ్డాడు.

    ReplyDelete
  9. కిక్కిక్కీ... కిక్కిక్కీ...
    నేనిక్కడ కింద పడి దొర్లి దొర్లి మరీ నవ్వింగ్స్;) బాబ్బాబు, దయచేసి నా వైపు కానీ, నా బ్లాగు వైపు కానీ మీ కన్నెయ్యకండి.. ఈ మధ్యనే ఎక్కడో చదివా మన చుట్టూ ఉండే వారి జాతకాలు కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి అని;)
    Jokes apart, post is nice..:)

    ReplyDelete
  10. థాంక్స్ అప్పుగారు. ఎంతమాట? మీ బ్లాగ్ చదవకుండా, అక్కడ కామెంటకుండా ఉండడమే..! మీరేం బెంగపెట్టుకోకండి. నా లక్కుని మీక్కూడా కొంత అంటించే తీరతాను. :P

    ReplyDelete