చీకటి పడింది. నాన్న ఇంకా ఇంటికి రాలేదు. నేను, అక్క అరుగు మీద కూర్చుని
పెంకుల పైనుంచి జారిపడుతున్న నీటిచుక్కల్ని పట్టుకోడానికి
ప్రయత్నిస్తున్నాం. మూడు రోజుల నుంచి తెరిపిలేకుండా పడుతున్న వానకి నేలంతా
తడిసి ముద్దయింది. ఇప్పుడే అలిసిపోయి కొంచెం అలసట తీర్చుకుంటున్నట్టుంది.
ముసురు పడితే మూడ్రోజుల దాకా వదలదంట. నాన్న చెప్పాడు. అమ్మ కిరోసిన్ పోసి
దీపం వెలిగిస్తోంది. దీపం వెలిగించగానే కొద్దిగా గుమ్మం వారగా వెలుగులోకి
జరిగింది అక్క. అక్కకి చీకటంటే చెప్పలేనంత భయం. బయటికి చెప్పదు గానీ అమ్మకి
కూడా చీకటంటే భయమే. నేను మగాణ్ణి కదా భయపడకూడదని నాన్న చెప్పాడు. భయపడ్డా
పడినట్టు తెలియనివ్వకూడదని మావయ్య చెప్పాడు. కానీ ఇలాంటప్పుడు ఈ
కరెంటోళ్లని తలచుకుంటే గొప్ప కోపం వస్తుంది. నాన్న అంటుంటాడు 'వర్షాకాలంలో
మీ చదువులు, కరెంటోళ్ల వెలుగులు ఒకలాగే ఉంటాయిరా. ఎప్పుడు పోదామా అని
చూస్తుంటారు' అని. నేను ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ చీకట్లోనే కూర్చుని,
నాన్న కోసం చూస్తున్నాను.
ఇంతలో అమ్మ అన్నం కలిపి లోపలికి పిలిచింది.
"అప్పుడేనా? నాన్నొచ్చాక తింటాంలే" అంది అక్క.
"ఇంకెప్పుడే తల్లీ? మీ నాన్నొచ్చేటప్పటికి ఎంత అవుతుందో.
వచ్చి తినండర్రా. మళ్లీ రేపు స్కూల్‌కెళ్లాలి." అని లాక్కెళ్లిపోయింది
అమ్మ.
అయిష్టంగా
కంచం ముందు కూర్చున్నా వీధి వైపే చూస్తున్నాం ఇద్దరం. ఇంతలో చీకట్లో లీలగా
ఒక మనిషి కనిపించారు. అంతే.. గబుక్కున లేచి గుమ్మం దగ్గరికి పరిగెత్తాం.
కొంచెం వెలుగులోకి రాగానే చిరునవ్వు నవ్వుతూ నాన్న కనిపించేసరికి
అరుగుమీంచే ఎగిరి నాన్న మీదకి దూకేశా. నన్ను ఎత్తుకుని తమాయించుకునేలోపు
అక్క కూడా నాన్నని గట్టిగా పట్టుకుంది. ఇద్దర్నీ ఎత్తుకుని లోపలి
తీసుకొచ్చి, జేబులోంచి రెండు చాక్లెట్లు తీసిచ్చారు. మా ఇద్దరి కళ్ళల్లోనూ
వెయ్యి దీపాల వెలుగు. అది చూసి నాన్న కళ్ళలో లక్ష దీపాల కాంతి.
"వీటి కోసమేనా బాబూ తిండి తినకుండా కూర్చున్నారూ? అయినా మీరు మరీనూ.. ఇప్పుడివన్నీ ఇస్తే ఇంక తిండేం తింటారు? చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మీరు బాగానే మంచి చేసుకుంటారుగానీ తర్వాత నేను తిండి తినిపించలేక చావాలి" అంది అమ్మ.
నేను మనసులో అనుకున్నాను.. 'పిచ్చి అమ్మా! నాన్న తెచ్చేవాటి కోసం కాదు ఈ ఎదురుచూపు.. నాన్న కోసం'
* * *
నాకు నాన్నంటే ఇష్టం. ఎంతంటే కొలతలు లేవు. కొన్నిటికి లెక్కలూ కొలతలూ ఉండవు మరి. ఎగరగలిగితే ఆకాశమంత. ఈదగలిగితే సముద్రమంత. చూడగలిగితే మనలోని నమ్మకమంత. అనుభవించగలిగితే నాన్నలోని ప్రేమంత. అంత ఇష్టం నాకు. అమ్మంత ఇష్టం. అమ్మ కన్నా కుంచెం ఎక్కువ ఇష్టం.
నాకు ఊహ తెలిశాక నాకు దొరికిన ఏకైక స్నేహితుడు నాన్న. తను ఏరోజూ మేమడిగింది కాదనలేదు. జేబులో డబ్బు లేకపోయినా, అప్పు చేసైనా ముందు మా సరదాలు తీర్చేవాడు. అనవసరమైన ఖర్చులు పెడుతున్నారని అమ్మ కోప్పడేది కానీ మేము ఎగిరి గంతేస్తుంటే అమ్మ కూడా సరదాపడేది. మాకు ఖరీదైనవన్నీ కొనిపెడుతూనే అమ్మానాన్నలు కొన్నిసార్లు పస్తులు పడుకునేవారు. మా వయసుకి అప్పుడు ఆ కష్టాలు అర్థం కాలేదు.
తెలివైనవాడినే..కాని చదువులో మాత్రం వెనకబడిపోయేవాడ్ని. టీచర్లు పిలిచి చెప్పేవారు మీ వాడికి అల్లరి తప్ప చదువు అబ్బేలా లేదండీ అని. అమ్మ బాధపడేది. కొడతారేమో అని నేను భయపడేవాడిని. కానీ నాన్న చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు. "నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందోయ్. వీళ్ళు చెప్పేదేంటి వాడు చాలా గొప్పవాడవుతాడు చూడు" అనేవాడు. నాన్న నమ్మినట్టు నేను గొప్పవాణ్ణి కాలేదు కాని ఆయన నా మీద పెట్టిన నమ్మకం మాత్రం నా ఆత్మవిశ్వాసాన్ని నిలబెడుతూనే ఉంటుంది. నాకు మార్కులు బాగా వచ్చినప్పుడల్లా చెప్పుకుని పొంగిపోయేవాడు. బాగా రానప్పుడు 'పోన్లేరా.. మార్కులు ముఖ్యం కాదు. ఎంత నేర్చుకున్నావన్నది ముఖ్యం' అని ఊరుకునేవాడు. పరిస్థితులకు అనుగుణంగా మనుషులతో ఎలా ప్రవర్తించాలి అని నాన్న నేర్పిన మొదటి పాఠం అది.
పదోతరగతి దాటి కాలేజ్‌లోకి అడుగుపెట్టాను. కాలేజ్‌కి వెళ్లే ముందు మొదటిరోజు నాన్న చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. "డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, మనుషుల్ని పోగొట్టుకుంటే మరొకరు ఆ లోటుని భర్తీ చేయొచ్చు, బంధాలు తెగిపోతే తిరిగి కలుపుకోవచ్చు. కాని 'వ్యక్తిత్వం' కోల్పోతే తిరిగి సంపాదించలేం. సంపాదించినా దానికి విలువ ఉండదు. అదొక్కటి లేని నాడు మిగతావన్నీ ఉన్నా మనిషికి, జంతువుకి తేడా ఉండదు."
ఆ విషయంలో మాత్రం నాన్నే నాకు ఆదర్శం. డబ్బు లేకపోయినా, తిండికి లేక పస్తులు పడుకున్నా, అడ్డదారులు తొక్కే అవకాశాలు దొరికినా ఏనాడూ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేదు. తనలా నేను కూడా కష్టాలు పడకూడదని నిరంతరం జాగ్రత్త పడేవాడు. 'డబ్బు లేనిదే ఈ లోకంలో మనిషికి విలువ లేదు. బాగా సంపాదించు. నిజాయితీగా సంపాదించు. సంపాదించిన దాంట్లో నువ్వు తినగా మిగిలింది నలుగురికీ పెట్టు. కానీ అపాత్రదానం చెయ్యకు.' అని జాగ్రత్తలు చెప్పేవాడు.
ఇక చివరిగా తనకెంతో ఇష్టమైన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాడు. 'డబ్బు లేకపోతే విలువ ఉండదు. కాని ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కితే దానికి నిలకడ ఉండదు. గంజి తాగైనా బ్రతుకు. కాని మరొకడి కడుపు కొట్టో, ఒకడికి అన్యాయం చేసో మాత్రం పంచభక్ష్య పరమాన్నాలు తినాలనుకోకు. చివరిగా ఒకే మాట.. అప్పు చేయకు, తప్పు చేయకు'.
నాకు నడక నేర్పింది మొదలు నడత నేర్పించేవరకు నా చేయి వదలలేదు నాన్న. నాలుగేళ్ళ వయసులో పుస్తకాలు చదివించాడు. ఎనిమిదేళ్ళ వయసులో ప్రపంచం చూపించాడు. పదేళ్ళకి నాతో రాజకీయాలు మాట్లాడాడు. పదమూడేళ్లకి సాహిత్య చర్చలు జరిపాడు. పదిహేనేళ్లకి వ్యక్తిత్వమంటే ఏంటో ఆచరణలో చూపించాడు. పదహారేళ్లకి చేయి వదిలేసి వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ కూడా బ్రతికే ధైర్యం ఇచ్చి వెళ్లాడు. జీవితం అంటే కాలానికి ఎదురునిలవడం అని పాఠం నేర్పించి వెళ్లిపోయాడు. నాకు ఆస్తులు, అంతస్థులు ఇవ్వలేదు.. కాని వాటిని కాళ్ల దగ్గరికి రప్పించుకోగలననే నమ్మకాన్నిచ్చాడు. అవసరమైతే కాలదన్నగల విలువలు నేర్పించాడు. అందుకే నాన్నే నాకు మిత్రుడు, గురువు, మార్గనిర్దేశకుడు. నా జీవితంలో సాధించే ప్రతి విజయం, ఎక్కే ప్రతి మెట్టూ నాన్న కోసం..